
Sandeshkhali Case: పశ్చిమ బెంగాల్‌కు చెందిన సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేశారు. మణిపూర్ తరహాలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయవాది అలఖ్ అలోక్ శ్రీవాస్తవ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇక, టీఎంసీ నేత షేక్ షాజహాన్ సందేశ్‌ఖాలీ ప్రాంతాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్‌లో పేర్కొన్నారు. పీడీఎస్ పథకంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జనవరి 5న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందం సందేశ్‌ఖాలీలోని షేక్ షాజహాన్ ఇంటిపై దాడికి వెళ్లింది.. అప్పుడు టీఎంసీ నేతకు సంబంధించిన గూండాలు ఈడీ అధికారులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు అనే విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లారు. ఈ కేసులో నిష్పక్షపాతమైన విచారణ పశ్చిమ బెంగాల్‌లో జరగదు.. అందువల్ల న్యాయ ప్రయోజనాల దృష్ట్యా దీనిని పశ్చిమ బెంగాల్ వెలుపలికి బదిలీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, బాధిత మహిళల ఫిర్యాదులను నమోదు చేయకుండా.. వారి బంధువులపైనే పోలీసులు ఫిర్యాదులు చేశారని జాతీయ మహిళా కమిషన్ తన దర్యాప్తులో గుర్తించిందని పిటిషన్ పేర్కొంది. స్థానిక పోలీసులు బాధితులను బెదిరించి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.. పశ్చిమ బెంగాల్ స్థానిక పోలీసులపై అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని, నేరస్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇతర కుటుంబాలన్ని ఇరికించారని ఆరోపణలు చేస్తున్నారు. బాధితుల నోరు మూయించేందుకు సొంత వాళ్లను కూడా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని వారు ఆరోపించారు.