Leading News Portal in Telugu

CBSE: సీబీఎస్‌ఈ పరీక్షల రద్దు ప్రచారంపై బోర్డు క్లారిటీ



S

దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈ (CBSE Board) బోర్డు 10, 12 తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల ప్రారంభానికి ముందే దేశ రాజధాని ఢిల్లీకి అన్నదాతలు కదంతొక్కారు. పెద్ద ఎత్తున రైతులు హస్తినకు తరలివచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా రైతుల ఆందోళన నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు అయ్యాయంటూ ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో CBSE బోర్డు స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోన్న నకిలీ లేఖను CBSE బోర్డు ఖండించింది.

పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు ఉన్న నకిలీ సమాచారంపై పాఠశాలలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని అప్రమత్తం చేసింది. అలాంటి నకిలీ లేఖను నమ్మొద్దని విద్యార్థులను బోర్డు కోరింది.

కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందని.. పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంటూ ప్రిన్సిపాళ్లకు అడ్రస్‌ చేస్తూ సీబీఎస్‌ఈ బోర్డు పేరిట ఓ నకిలీ లేఖ హల్‌చల్‌ చేసింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి సమాచారాన్ని నమ్మొద్దని అధికారిక ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేసింది. అప్రమత్తంగా ఉండండి.. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఆ లేఖ నకిలీ అని కొట్టిపారేసింది.

దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు గురువారం నుంచి మొదలయ్యాయి. భారత్‌తో పాటు 27 దేశాల్లో దాదాపు 39 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. రైతుల చలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉన్నందున విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయల్దేరి పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని కోరింది. అలాగే‘ఎక్స్‌’లో CBSE పేరుతో అనేక నకిలీ ఖాతాలు ఉన్నాయని.. వాటిని ఫాలో కావొద్దని కోరింది.