
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖలీ గత కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో మహిళలు, యువత టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తన నిరసన, ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి బీజేపీ పార్టీ నుంచి సపోర్టు లభిస్తోంది.
తాజాగా టీఎంసీ బ్లాక్ ప్రెసిడెంట్ సభ్యుడితో పాటు మరొక కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో కీలక నేత శిబు ప్రసాద్ హజ్రా ఉన్నారు. అత్యాచార చట్టాల కింద ఇతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అఘయిత్యాలకు గురైన మహిళల్ని పరామర్శించేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పోలీసులు, రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య రణరంగంగా మారుతోంది.
Read Also: Poonam Pandey: “నిజం త్వరలో బయటకు వస్తుంది”.. పూనమ్ పాండే పోస్ట్ వైరల్
ముఖ్యంగా బీజేపీ అక్కడి ప్రజలకు సపోర్టుగా నిలుస్తోంది. ఇటీవల రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ మహిళల్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో పోలీసులతో తోపులాటలో గాయపడ్డారు. రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం టీఎంసీ గుండాలకు మద్దతుగా నిలుస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
గత నెలలో రేషన్ అక్రమాలపై ఈడీ విచారణ చేపట్టేందుకు సందేశ్‌ఖలీ వెళ్లిన సమయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతడి అనుచరులు ఈడీ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చాలా మంది అధికారులు గాయపడ్డారు. ఆ తర్వాత టీఎంసీ నేతలు ఈ ప్రాంతంలో ఊర్లపై పడి మహిళలపై లైంగిక దాడులకు దిగారు. ఈ ఘటనల తర్వాత నుంచి షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు.