Leading News Portal in Telugu

Farmers Protest: రైతుల ఆందోళనకు బ్రేక్.. ఎంఎస్‌పీ ప్రణాళికను ప్రకటించిన కేంద్రం..



Farmers Protest

Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని డిమాండ్ చేస్తూ రైతులు ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు దేశ రాజధానిని ముట్టడించాలని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని హర్యానా-ఢిల్లీ బార్డర్‌లో అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వారం రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంఎస్‌పీతో సహా మొత్తం 12 డిమాండ్లను రైతు సంఘాలు కేంద్రం ముందుంచాయి.

ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్రమంత్రులు రైతు సంఘాల నేతలతో మూడు సార్లు సమావేశం కాగా, ఆదివారం నాలుగోసారి మంత్రులు వారితో చర్చించారు. ఎంఎస్‌పీ కోసం కేంద్రం ఒక ప్రణాళికను ప్రకటించింది. దీంతో రైతులు తమ నిరసనకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈ ప్రతిపాదనపై మరో రెండు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు ప్రకటించారు. అప్పటి వరకు ఢిల్లీ ఛలో మార్చ్‌ని నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఎమ్‌ఎస్‌పికి చట్టబద్ధమైన హామీతో సహా తమ డిమాండ్లపై ఆదివారం ఇక్కడ రైతు నాయకులతో నాలుగో విడత చర్చలు జరిపారు.

Read Also: Illicit Relationship: భార్య ఒత్తిడితో “ఎగ్ రోల్‌”లో విషం పెట్టి ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి..

సమావేశం అనంతరం కేంద్రమంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఐదేళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటకలు ప్రభుత్వ సంస్థల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్యానెల్ ప్రతిపాదించినట్లు తెలిపారు. ఎన్‌సిసిఎఫ్ (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్) మరియు నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వంటి సహకార సంఘాలు పప్పు ధాన్యాలు పండించే రైతులో ఒప్పందం కుదుర్చుకుంటాయని, వచ్చే ఐదేళ్ల పాటు తమ పంటలను ఎంఎస్‌పీతో కొనుగోలు చేస్తామని చెప్పారు. కొనుగోలుపై ఎలాంటి పరిమితి ఉండని ప్రకటించారు. కేంద్రం ప్రతిపాదనపై ఫిబ్రవరి 19-20 తేదీల్లో మా ఫోరమ్‌లలో చర్చించి దీనిపై నిపుణుల అభిప్రాయం తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.