
కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రే కాలయముడయ్యాడు. తండ్రి అంటే కొండంత అండగా ఉండాల్సిన ఓ దుర్మార్గుడు కడుపున పుట్టిన బిడ్డపైనే కన్నేశాడు. ఈ దారుణాన్ని భరించలేని ఓ బాలిక అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ దారుణ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది.
ఆ బాలిక (14) ఐపీఎస్ కావాలని ఎన్నో కలలు కంది. తండ్రే లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఒడిశాలోని పూరీ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రి లైంగిక వేధింపుల కారణంగానే ఆమె తన ప్రాణాలను బలిగొందని బాలిక తల్లి ఆరోపించింది. తన భర్త రాక్షసుడు అంటూ బాలిక తల్లి వాపోయింది. అతను మద్యం తాగి తన కుమార్తెను లైంగికంగా వేధించేవాడని చెప్పింది. తాను జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కొట్టేవాడని ఆమె అన్నారు. భర్త అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉందని బాధితురాలి తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన చావుకు తండ్రే కారణమంటూ చనిపోయిన బాలిక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న తండ్రిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.