Leading News Portal in Telugu

Ranchi Test: భారత్‌, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌.. ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు!



Gurpatwant Singh Pannu

FIR against Khalistani terrorist Gurpatwant Singh Pannu: భారత్‌, ఇంగ్లండ్ మ‌ధ్య రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. అయితే ఈ టెస్ట్‌ మ్యాచ్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ నుంచి బెదిరింపులు వచ్చాయి. నాలుగో టెస్టు మ్యాచ్‌ను అడ్డుకోవాల‌ని ఆయ‌న సీపీఐ ద‌ళాన్ని కోరారు. ఈ మేరకు పన్నూ తన సోష‌ల్ మీడియాలో ఓ వీడియోలో అప్‌లోడ్ చేశాడు.

ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరింపుల నేపథ్యంలో ఝార్ఖండ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్ జరగనున్న జేఎస్సీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం కాంప్లెక్స్‌లో మరింత భద్రతను కల్పించారు. నిషేధిత సీపీఐ మావోయిస్టులు మ్యాచ్‌కు అడ్డంకులు సృష్టించాలని చెప్పిన పన్నూపై దుర్వా పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదైంది. ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టినట్లు డీఎస్పీ పీకే మిశ్రా తెలిపారు. ఇటీవల కాలంలో పన్నూ పలుమార్లు భారత్‌ను బెదిరించాడు. గతంలో ప్రపంచకప్‌ ఫైనల్‌, ఎయిర్‌ ఇండియా విమానాలను, అమెరికా-కెనడా దేశాల్లోని భారతీయులను లక్ష్యంగా చేసుకొంటామని బెదిరింపులకు పాల్పడ్డాడు.

Also Read: Yuvraj Singh: లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ టికెట్‌పై యువరాజ్ సింగ్ పోటీ?

సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్ను కూడా ఒకడు. 2007లో ఎస్ఎఫ్‌జేను స్థాపించగా.. 2019లో భారత్‌ నిషేధించింది. అప్పటినుంచి నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ దృష్టిలో పన్ను ఉన్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం 2020లో పన్నును ఉగ్రవాదిగా ప్రకటించింది. 2021 ఫిబ్ర‌వ‌రి 3న ఎన్ఐఏ ప్ర‌త్యేక కోర్టు అతడిపై నాన్‌బెయిల‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇటీవల పన్ను భూమి, ఇంటిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకొంది.