
చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం షాకిచ్చింది. మేయర్ ఎన్నిక (Chandigarh Mayoral Polls) సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే అధికారి తీరుపై చీవాట్లు పెట్టింది. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారా? అంటూ ధ్వజమెత్తింది. తాజాగా మంగళవారం కూడా రిటర్నింగ్ అధికారి తీరుపై సుప్రీం (Supreme Court) మండిపడింది.
సోమవారం చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాలపై వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మంగళవారం బ్యాలెట్ పత్రాలతో హాజరుకావాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశించింది. ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు… చెల్లని 8 ఓట్లను రీకౌంటింగ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
వివాదాస్పదమైన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో చెల్లని బ్యాలెట్ పత్రాలను మంగళవారం సుప్రీంకోర్టు పరిశీలించింది. చెల్లని 8 ఓట్లను తిరిగి లెక్కించాలని పేర్కొంది. 8 ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌కు అనుకూలంగా ఉన్నాయని ధర్మాసనం గమనించింది. దీంతో ఆప్ అభ్యర్థే మేయర్ అంటూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
బ్యాలెట్ పత్రాలను తమ ముందు సమర్పించాలని రిటర్నింగ్ అధికారికి సోమవారం కోర్టు ఆదేశించింది. ఈరోజు వాటిని న్యాయస్థానంలో హాజరుపరచగా.. బ్యాలెట్లను న్యాయవాదులు పరిశీలించారు. 8 ఓట్లు కూడా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌కు పడ్డాయి. కానీ రిటర్నింగ్ అధికారి మాత్రం 8 ఓట్లు చెల్లనివిగా అడ్డగీతలు వేశారు. అనంతరం బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు. దీంతో ఆప్-కాంగ్రెస్ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చండీగఢ్ రిటర్నింగ్ అధికారికి చీవాట్లు పెట్టింది.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు విచారణకు ముందే చండీగఢ్ బీజేపీ మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లను బీజేపీలో చేర్చుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆప్, కాంగ్రెస్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.