Leading News Portal in Telugu

Sita and Akbar: సింహాల పేర్లపై బెంగాల్‌ హైకోర్టు కీలక సూచన



Bangal Safri

ఇటీవల పశ్చిమబెంగాల్‌లో రెండు సింహాల పేర్లపై తీవ్ర దుమారం చెలరేగింది. ఒకే ఎన్‌క్లోజర్‌లో సీత-అక్బర్ అనే సింహాలను పెట్టడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తక్షణమే పేర్లు మార్చాలంటూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన రెండు సింహాల (Sita and Akbar) పేర్లను మార్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు సూచించింది.

పశ్చిమ బెంగాల్‌లోని శిలిగుడి సఫారీ (Bengal Safari) పార్కులో అక్బర్‌, సీత పేర్లు కలిగిన ఆడ, మగ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడంతో ఈ వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారం ఇప్పటికే కలకత్తా హైకోర్టు (Calcutta High Court)కు చేరుకోగా.. జల్‌పాయీగుడీ సర్క్యూట్‌ బెంచ్‌ ఆ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా రెండు సింహాల పేర్లను మార్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది.

త్రిపురలోని సిపాహీజలా జులాజికల్‌ పార్క్‌ నుంచి బెంగాల్‌ అధికారులు అక్బర్‌, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకు తీసుకొచ్చారు. అనంతరం వాటిని ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీంతో రాష్ట్ర అటవీశాఖ అధికారులే సింహాలకు ఆ పేర్లు పెట్టారని.. అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్వహిందూ పరిషత్‌ (VHP) ఆరోపించింది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్‌ చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

తాజాగా దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ సౌగతా భట్టాచార్య ఏకసభ్య ధర్మాసనం.. ఈ వివాదానికి తెరదించాలని పేర్కొంది. ఇందుకోసం సింహాల పేర్లను మార్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం తరఫున హాజరైన ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ఆ పేర్లను త్రిపురలో పెట్టారని, వాటి పేర్లను మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే యోచిస్తోందని ధర్మాసనానికి తెలిపారు.