Leading News Portal in Telugu

Haldwani violence: హల్ద్వానీ అల్లర్ల సూత్రధారి అబ్దుల్ మాలిక్ అరెస్ట్..



Haldwani Violence

Haldwani violence: ఉత్తరాఖండ్ హల్ద్వానీ ప్రాంతంలో ఫిబ్రవరి 8న తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నగరంలోని బన్‌భూల్‌పురాలో అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు కోర్టు ఆదేశాల మేరకు కూల్చవేస్తున్న తరుణంలో హింస చోటు చేసుకుంది. పోలీసులు, ఇతర అధికారులే టార్గెట్‌గా స్థానికులు విరుచుకుపడ్డారు. పోలీసులను నిర్బంధించి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు వారిపై దాడి చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు.

Read Also: Srilatha Shoban Reddy : బీఆర్ఎస్‌కు GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా

అయితే, ఈ ఘర్షణల్లో వందకు పైగా పోలీసులు గాయపడగా.. ఐదుగురు మరణించారు. ఈ అల్లర్లలో విద్రోహ కోణం ఉందని ఉత్తరాఖండ్ పోలీసులు, అధికారులు చెప్పారు. అప్పటి నుంచి ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన సూత్రధారుల కోసం వేట సాగుతోంది. తాజాగా ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా ఉన్న అబ్దుల్ మాలిక్‌కి ఢిల్లీలో అరెస్ట్ చేశారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి సర్కార్ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అల్లర్లకు పాల్పడిన వారిని వేటాడి పట్టుకుంటోంది.

హల్ద్వానీ నగరంలోని బన్‌భుల్‌పురా ప్రాంతంలో అల్లర్ల నేపథ్యంలో వారం రోజుల పాటు కర్ఫ్యూని విధించారు. నేరస్తులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకున్నారు. అయితే, ప్రధాన సూత్రధారిగా ఉన్న అబ్దుల్ మాలిక్ కోసం గత కొన్ని రోజులుగా పోలీసులు గాలిస్తున్న క్రమంలో తాజాగా ఢిల్లీలో పట్టుబడ్డాడు.

అబ్దుల్ మాలిక్ తరుపు న్యాయవాది అతని కోసం ముందస్తు బెయిల్ అప్లై చేశాడు. గురువారం రోజు నైనిటాల్ ఎస్ఎస్‌పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనా మాట్లాడుతూ.. అబ్దుల్ మాలిక్, అతని భార్య సఫియాతో సహా ఆరుగురిపై నేరపూరిత కుట్రతో పాటు, చనిపోయిన వ్యక్తికి చెందిన అక్రమ ప్లాట్లు, నిర్మాణం, భూమి బదిలీని మోసపూరితంగా ఉపయోగించారని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.