Leading News Portal in Telugu

Haryana: ఐఎన్ఎల్‌డీ చీఫ్ నఫే సింగ్ రాథీని కాల్చి చంపిన దుండగులు..



Haryana

Haryana: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్‌డీ) చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీని ఈ రోజు సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆయన ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ కార్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఝజ్జర్ జిల్లాలో జరిగింది. అతనితో పాటు మరో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో వచ్చిన దుండగులు సమీపం నుంచి రాథీ, అతని అనుచరులపై కాల్పులకు తెగబడ్డారు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

Reda Also: Israel-Hamas War: గాజాలో ఆకలి కేకలు.. కలుపు మొక్కలు, పశుగ్రాసమే ఆహారం..

గాయపడిన వారిని వెంటనే వైద్య చికిత్స కోసం సమీపంలోని బ్రహ్మశక్తి సంజీవని ఆస్పత్రికి తరలించగా.. రాథీ అక్కడికి చేరుకునే లోపే మరణించినట్లు ప్రకటించారు. నఫే సింగ్ రాథీ మరణించినట్లు ఐఎన్‌ఎల్‌డీ మీడియా సెల్ హెడ్ రాకేష్ సిహాగ్ ధృవీకరించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సన్నిహితులు కాలా జాతేడీ ఈ దాడి వెనక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆస్తి తగదాల కారణంగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

నఫే సింగ్ రాథీ హర్యానా అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హర్యానా లెజిస్లేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు, దుండగులు పారిపోయేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలపై నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA), STF బృందాలు కేసు దర్యాప్తు ప్రారంభించాయని, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని ఝజ్జర్ ఎస్పీ అర్పిత్ జైన్ చెప్పారు.