Leading News Portal in Telugu

West Bengal: ప్రధాని మోడీ బెంగాల్ పర్యటన నేపథ్యంలో.. భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన మమతా బెనర్జీ..



Mamata Banerjee

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో సందేశ్‌ఖలీ ప్రాంతంలో మహిళలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. గత రెండు వారాలుగా ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. మహిళల ఆందోళనలకు బీజేపీ మద్దతు ఇచ్చింది. సందేశ్‌ఖలి ఘటన లోక్‌సభ ఎన్నికల ముందు మమతా బెనర్జీకి తీవ్ర ఇబ్బందిగా మారింది.

Read Also: SIMI Terrorist: 22 ఏళ్లుగా పరారీలో ఉన్న సిమి టెర్రరిస్ట్ హనీఫ్ షేక్ అరెస్ట్.. ఒకే క్లూతో చిక్కాడు..

ఇదిలా ఉంటే మార్చి 1,2,6 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రధాని మోదీ మార్చి 1న హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్, మార్చి 2న నదియా జిల్లాలోని కృష్ణానగర్ మరియు మార్చి 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్‌లో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లర్లతో హింసాత్మకంగా ఉన్న సందేశ్‌ఖలీ ప్రాంతం ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉంది.

ఇదిలా ఉంటే, టీఎంసీ నేతలు, కార్యకర్తలపై భూ కుంభకోణాలు, లైంగిక నేరాల వంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తృణమూల్ భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మార్చి 10న సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ‘జన గర్జన’ సభ జరగబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చెప్పారు. ‘‘మార్చి 10న జరిగేది టీజర్ మాత్రమే అని, అసలు సినిమా ఎన్నికల్లో ఉంటుంది’’ అని అన్నారు.