Leading News Portal in Telugu

Mallikarjun Kharge: రాష్ట్రపతికి ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!



Karge

నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (Droupadi murmu) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు.

 

లేఖలో ఏముందంటే..
సైనిక దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకంతో దేశ యువతకు అన్యాయం జరుగుతోందని ఖర్గే ఆరోపించారు. సాయుధ దళాల్లో శాశ్వత ఉపాధి కోరుకునే యువతకు అగ్నిపథ్‌తో అన్యాయం జరుగుతోందని ఖర్గే పేర్కొన్నారు. వారికి న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సాయుధ బలగాల్లో శాశ్వత నియామకాలను నిలిపివేయడంతో దాదాపు 2 లక్షల మంది యువత భవిష్యత్తులో అనిశ్చితి నెలకొందన్నారు.

ఈ పరిణామం ఆత్మహత్యలకు దారి తీసిందని ఖర్గే గుర్తుచేశారు. యువత సమస్యలు ఎదుర్కొంటుంటే చూస్తూ ఊరుకోలేమన్నారు. వారికి న్యాయం చేయాలని రాష్ట్రపతి ముర్మును కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే.. అగ్నిపథ్‌ విధానం రద్దు చేస్తామని ఖర్గే పేర్కొన్నారు. దాని స్థానంలో పాత నియామక పద్ధతిని పునరుద్ధరిస్తామన్నారు.

తీవ్ర ఆందోళనలకు తెర లేపిన..
అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ఈ నియామక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని అగ్నివీర్లు అంటారు. 2022 జూన్‌ 14 న భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకాన్ని 2022 సెప్టెంబరు నుంచి అమలు చేయాలని తలపెట్టింది. సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. ఇక నియమితుల ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.

ఈ పథకం ద్వారా గతంలో ఉన్నట్లుగా దీర్ఘ కాలం పాటు పని చేసే పద్ధతి పోతుంది. ఉద్యోగం నుంచి విరమణ పొందాక పింఛను రాదు. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి.

ఇక ఈ పథకంపై దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. హింస జరిగింది. 12 రైళ్ళను తగలబెట్టారు. అనేక రైళ్ళను మధ్య లోనే నిలిపివేయడం, రద్దు చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరుద్యోగులు చెలరేగిపోయారు. స్టేషన్ ధ్వంసం చేయడంతో పాటు పలు రైళ్లను తగలబెట్టారు.