Leading News Portal in Telugu

Kejriwal: మంగళవారం కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ కీలక భేటీ.. దేనికోసమంటే.. !



Kejie

త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం కోసం బీజేపీ ప్రణాళికలు రచిస్తుంటే.. ఈసారి ఎలాగైనా కమలం పార్టీని గద్దె దించాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.

తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) నివాసంలో మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. హర్యానా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.. అనంతరం పేర్లను ఆప్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో ఆ మధ్య ఒడిదుడుకులు ఎదురైనా ప్రస్తుతం అవన్నీ సర్దుకుంటున్నాయి. కాంగ్రెస్‌తో ఆయా పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఒక్కతాటి పైకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించింది. సయోధ్య కుదరడంతో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అఖిలేష్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అలాగే ఢిల్లీ, పంజాబ్‌లో కూడా కాంగ్రెస్ సీట్లు షేర్ చేసుకునేందుకు ఆప్ ముందుకొచ్చింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ కూడా పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌కు సీట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా విపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి.