Leading News Portal in Telugu

Punjabi singer: 58 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న సిద్ధూ మూసేవాలా అమ్మ



Singe

దివంగత పంజాబీ గాయకుడు (Punjabi singer) సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) తల్లి లేటు వయసలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. చరణ్‌ కౌర్‌ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్నారని సమాచారం. ఈ మేరకు కుటుంబ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె వయసు ప్రస్తుతం 58 ఏళ్లు.

ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు (28) గురయ్యారు. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో దుండగులు అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది.

తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం. కన్నబిడ్డను కోల్పోయిన దుఖంలో ఉన్న ఆ వృద్ధ దంపతులు మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్‌ ద్వారా ఇటీవల చరణ్‌ కౌర్‌ గర్భం దాల్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చిలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కౌర్‌ వయసు 58 ఏళ్లు కాగా.. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌ వయసు 60ఏళ్లు.

మే 15, 2020న సిద్ధు మూసేవాలా ఓ పాటను విడుదల చేసి తన తల్లికి అంకితమిచ్చారు. తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ పాట విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోలో ఆయన తల్లి చరణ్ కౌర్, తండ్రి బాల్కౌర్ సింగ్ కూడా కనిపిస్తారు. ఈ పాటను ఇప్పటిదాకా యూట్యూబ్‌లో 143 మిలియన్ల మంది వీక్షించారు.

ఇక సిద్ధు మూసేవాలా.. 2022 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆయన ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. సిద్ధు మూసేవాలా చనిపోయాకా తమకు న్యాయం చేయాలంటూ ఆయన తల్లిదండ్రులు పలు సందర్భాలలో కోరారు.