
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మరో వివాదం చెలరేగింది. అసెంబ్లీలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం రాజకీయ దుమారం రేపింది. రాజ్యసభ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ నినాదాలు నిజమని ప్రతిపక్ష బీజేపీ నిరూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరోపణలపై ఫోరెన్సిక్ సైన్య ల్యాబ్ విచారణకు సీఎం పిలుపునిచ్చారు.
Read Also: Priyanka Gandhi: 25 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ని ఎలా సవాల్ చేస్తుంది.? హిమాచల్ పరిణామాల ఫైర్..
కర్ణాటకలో నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోగా.. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ గెలుపు అనంతరం ఆయన మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటూ..‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అని నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ మాత్రం బీజేపీ ఆరోపణల్ని తోసిపుచ్చింది.
ఈ ఆరోపణలపై వాయిస్ నివేదికను ఎఫ్ఎస్ఎల్‌కి పంపామని, నివేదిక అందిన తర్వాత నిజాలు తెలుస్తాయని సీఎం అన్నారు. ఎవరైనా దోషులుగా తేలితే ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఇది బీజేపీ కుట్ర అని అన్నారు. అసత్యాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఆరోపణలతో కర్ణాటక అసెంబ్లీలో బుధవారం గందరగోళం చెలరేగింది.