Leading News Portal in Telugu

Indore: ఇండోర్‌లో దారుణం.. బల్కానీలో భార్యపై దాడి.. వీడియో వైరల్!



Indore

మూడు పేటల తాడు త్వరగా తెగిపోదంటారు పెద్దలు. భార్య మెడలో మూడు ముళ్లు వేసి కలకాలం తోడుంటానని ప్రమాణం చేసిన ఓ భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాలనుకున్నాడు ఓ దుర్మార్గపు భర్త. అత్యంత దారుణంగా హింసించి చంపే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore) చోటుచేసుకుంది.

జితేంద్ర పర్మార్, పూజా పర్మార్ ఇద్దరూ భార్యాభర్తలు. అయితే భార్య ఉండగానే మూడు నెలల క్రితం జితేంద్ర రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య పూజా పర్మార్‌తో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి బంగంగాలోని నార్వార్‌లో నివసిస్తోంది. అయితే గత ఆదివారం పూజా ఇంట్లో నిద్రిస్తుండగా.. భర్త జితేంద్ర, రెండో భార్య గాయత్రి, తల్లి బసంతీ బాయి, సోదరి పాయల్‌ ఇంట్లోకి ప్రవేశించి దారుణంగా దాడికి తెగబడ్డారు.

పూజాను కత్తితో పొడిచి.. జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్లి బాల్కనీ నుంచి కిందకి పడేసేందుకు భర్త ప్రయత్నించాడు. బాల్కనీలో జరిగిన పెనుగులాటలో ఆమె తలపై ఇటుకుతో విపరీతంగా భర్త దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఇండోర్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. స్థానికులు ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త, రెండో భార్య, తల్లి, సోదరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భర్త జితేంద్రను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మిగతా వారు పరారీలో ఉన్నారు.

భార్య తలపై ఇటుకతో కొట్టడంతో ఆమెకు విపరీతంగా రక్తస్రావం అయింది. బాధితురాలు తనను విడిచిపెట్టాలని వేడుకుంటున్నప్పటికీ నిందితులు ఏ మాత్రం కనికరం చూపించలేదు. జితేంద్ర రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.