Leading News Portal in Telugu

Himachal Pradesh: ట్విస్ట్ ఇచ్చిన మంత్రి! ఢిల్లీ పెద్దల ఎంట్రీతో ప్లాన్ రివర్స్



Pake

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) తలెత్తిన రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో బుధవారం ఉదయం రాజీనామా చేసిన మంత్రి విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) సాయంత్రానికి మనసు మార్చుకున్నారు. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

విక్రమాదిత్య సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. పార్టీ విస్తృత ప్రయోజనాలు, పార్టీ ఐక్యత దృష్ట్యా బుధవారం ఉదయం తాను ఇచ్చిన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేదన్నారు. మరింత ఒత్తిడి తీసుకురావాలని తాను కూడా అనుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.

మంగళవారం జరిగిన హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్‌కు షాక్ తగలింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడం, బీజేపీ అభ్యర్థి గెలుపొందటంతో సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం మనుగడపై అనుమానాలు రేకెత్తాయి. కొద్ది గంటల్లోనే విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో సంక్షోభం ముదిరినట్టే కనిపిచింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ కేంద్ర అధి నాయకత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక దూతలను హుటాహుటిన సిమ్లాకు పంపింది. దీంతో పరిస్థితులను చక్కదిద్దారు. ప్రస్తుతం సంక్షోభం సద్దుమణిగింది. ఇక బుధవారం ప్రారంభమై బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం బడ్జెట్‌ను ఆమోదించారు.

 

హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 40, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అయితే మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండింట్ సభ్యులు బీజేపీ అభ్యర్థికే ఓటు వేశారు. దీంతో రెండు పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో అనంతరం లాటరీ ద్వారా ఎంపిక చేయడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.