
దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకోబోతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జోస్యం చెప్పారు. అలాగే యూపీలో ఉన్న మొత్తం 80 పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీనే కైవసం చేసుకోబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం ‘టైమ్స్ నౌ నవభారత్ నవనిర్మాణ మంచ్ 2024’ కార్యక్రమంలో యూపీ సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం అఖిలేష్‌పై ధ్వజమెత్తారు. ముందు అఖిలేష్ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
అభివృద్ధిలో భారత్ మరింత ముందుకు సాగాలంటే మోడీ మూడోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో ఒక పెద్ద కార్యక్రమం జరిగిందని.. రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో కొత్త అయోధ్య రూపుదిద్దుకుందని తెలిపారు.
భారత ఐక్యత కోసం రాహుల్ గాంధీ ఏ రోజూ పని చేయలేదని యోగి విమర్శించారు. బీజేపీని ఓడించేందుకే రాహుల్ దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు. 2014కు మందు దేశం సర్వనాశనం అయిందని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. అభివృద్ధిలో దూసుకుపోతుందని యోగి వివరించారు.