Leading News Portal in Telugu

Sandeshkhali: సందేశ్‌ఖలీలో ముందే హోలీ వేడుకలు.. టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్ అరెస్టుతో వేడుకలు..



Sandeshkhali

Sandeshkhali: సందేశ్‌ఖలీ లైంగిక వేధింపుల నిందితుడు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 10 రోజుల కస్టడీ విధించింది. మరోవైపు టీఎంసీ అతడిని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడిని అరెస్ట్ చేయాలని కొన్ని వారాలుగా సందేశ్‌ఖలీలో మహిళలు, అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీరికి బీజేపీతో సహా పలు విపక్షాలు మద్దతు తెలిపాయి.

Read Also: Monkey fever: మంకీ ఫీవర్‌తో మరొకరు మృతి.. 10 రోజుల్లో మూడో మరణం..

ఇదిలా ఉంటే, షేక్ షాజహాన్ అరెస్టుతో సందేశ్‌ఖలీలో హోలీ ముందే వచ్చింది. ఆ ప్రాంత నివాసితులు నవ్వుతూ, రంగులు జల్లుకుంటూ ఆనందాన్ని వ్యక్త పరిచారు. బెంగాల్ పోలీసులు చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని అక్కడి ప్రజలు కోరారు. రేషన్ బియ్యం కుంభకోణంలో ఈడీ అధికారులు విచారణ జరిపేందుకు వెళ్లిన సమయంలో షాజహాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డారు. అప్పటి నుంచి అక్కడి మహిళలు టీఎంసీ గుండాలను అరెస్ట్ చేయాలని ఉద్యమిస్తున్నారు.

దాదాపుగా 55 రోజులు పరారీలో ఉన్న షాజహాన్‌ అరెస్ట్‌పై కలకత్తా హైకోర్టుతో పాటు గవర్నర్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో బెంగాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల తర్వాత అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ తెలియజేసింది. మరోవైపు బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. ఇది అరెస్ట్ కాదని, సీఎం మమతా బెనర్జీ పరస్పర సర్దుబాటని, కేంద్ర సంస్థలు నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకుంటే తప్ప అక్కడి ప్రజలకు న్యాయం జరగదని అన్నారు.