Leading News Portal in Telugu

Calcutta High Court: తృణమూల్ నేత షేక్ షాజహాన్‌పై తమకు “సానుభూతి” లేదన్న హైకోర్టు.. సందేశ్‌ఖలి అఘాయిత్యాల్లో ప్రమేయం..



Calcutta High Court

Calcutta High Court: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్‌ని ఎట్టకేలకు 50 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. రేషన్ బియ్యం కుంభకోణంలో విచారణ జరిపేందుకు వచ్చిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు దాడులకు తెగబడ్డారు. అంతే కాకుండా సందేశ్‌ఖలి ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో బెంగాల్‌లోని సందేశ్‌ఖలిలో మహిళలు, యువత టీఎంసీ లీడర్లకు వ్యతిరేకంగా ఉద్యమించింది. 55 రోజుల పరారీ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుపై కలకత్త హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. షేక్ షాజహాన్ తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్‌ని జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని బెంచ్ లేవనెత్తారు. తమకు షేక్ షాజహాన్ పట్ల ఎలాంటి సానుభూతి లేదని లాయర్‌ని ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈడీ అధికారులపై దాడి కేసులో అతడిని బెంగాల్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఇతడు, ఇతని అనుచరులు సందేశ్‌ఖలి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు భూకబ్జాలు, దోపిడి, బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Read Also: PM Surya Ghar Muft Bijli Yojana: సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కుటుంబానికి రూ. 78,000.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం..

ఈ రోజు షాజహాన్ తరుపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. షాజహాన్‌పై 43 కేసులు ఉన్నాయి, ఇవి మిమ్మల్ని 10 ఏళ్ల పాటు బిజీగా ఉంచుతాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అతని బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది న్యాయస్థానం. సోమవారం మరోసారి విచారణకు రావాలని, షేక్ షాజహాన్‌కి 10 రోజుల పాటు కస్టడీ విధించింది.

అంతకుముందు కలకత్తా హైకోర్టు షేక్ షాజహాన్‌ని రాష్ట్రపోలీసులు, సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయవచ్చని చెప్పింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా షాజహాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులకు 72 గంటల గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అతడిని నిన్న బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని వారాలుగా షేక్‌పై 100కు పైగా ఫిర్యాదులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా షేక్ మరియు అతని సహచరులపై 376డి (గ్యాంగ్ రేప్) సహా అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన సన్నిహితులు శిబాప్రసాద్‌ హజ్రా, ఉత్తమ్‌ సర్దార్‌లు ఇలాంటి ఆరోపణలపై గతంలో అరెస్టయ్యారు. మరోవైపు నమోదైన కేసుల దర్యాప్తును పశ్చిమ బెంగాల్ సీఐడీ చేపట్టింది.