Leading News Portal in Telugu

Rameshwaram Cafe Blast: “బ్యాగ్ వదిలేసి వెళ్లిన కస్టమర్”.. ఇది బాంబు పేలుడేనన్న బీజేపీ ఎంపీ.



Rameshwaram Cafe Blast

Rameshwaram Cafe Blast: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వర్ కేఫ్‌లో పేలుడు ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ముగ్గురు సిబ్బంది కాగా.. మరొకరు కస్టమర్. అయితే, ఈ పేలుడు సిలిండర్ వల్ల జరగలేదని, దానికి బాంబు పేలుడు కారణం కావచ్చని బీజేపీ బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య అనుమానం వ్యక్తం చేశారు.

Read Also: Himachal pradesh: సంక్షోభంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో ఇద్దరు తిరుగుబాటు!

‘‘రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు శ్రీనాగరాజ్‌తో పేలుడు గురించి మాట్లాడాను. కస్టమర్ వదిలేసిన బ్యాగ్ వల్ల పేలుడు సంభవించిందని, సిలిండర్ పేలడం వల్ల పేలుడు సంభవించలేదని ఆయన నాకు చెప్పారు. వారి ఉద్యోగి ఒకరు గాయపడ్డారు. ఇది స్పష్టంగా బాంబు పేలుడు కేసు. బెంగళూర్ సీఎం సిద్ధరామయ్య నుంచి సమాధానాలు కోరుతుంది’’ అని తేజస్వీ సూర్య ఎక్స్‌లో రాసుకొచ్చారు.

నగరంలో వైట్‌ఫీల్డ్‌లో ఉన్న రామేశ్వరం కేఫ్ పేలుడుతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గందరగోళం చెలరేగింది. ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. దీంతో బెంగళూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలంలో ఉన్నాయి. పేలుడుకు స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.