Leading News Portal in Telugu

PM Modi: మమత సర్కార్‌.. ఇండియా కూటమిపై మోడీ ఫైర్



Dmek

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇండియా కూటమిపై మరోసారి ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీ మహిళల బాధల కంటే.. కొంత మంది ఓట్లే మమతకు ముఖ్యమని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌కు రక్షణ కల్పించారని మోడీ ఆరోపించారు. ఆరంబాగ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.

గత కొద్దిరోజులుగా సందేశ్‌ఖాలీ ఘటనతో అట్టుడుకుతోంది. భూకబ్జా, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్‌పై మహిళలు ఆరోపణ చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ కూడా ఆందోళనలు చేపట్టింది. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. మొత్తానికి షాజహాన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్‌ కూడా షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది

తాజాగా ఇదే అంశంపై ప్రధాని స్పందించారు. రెండు నెలలుగా నిందితుడు షాజహాన్‌ను ప్రభుత్వమే కాపాడిందని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వానికి ఓటుతోనే సమాధానం చెప్పాలని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఇండియా కూటమిపై కూడా ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాంధీజీ మూడు కూతులు మాదిరిగానే.. ఇండియా కూటమి నేతలు కళ్లు, చెవులు, నోరు మూసుకున్నారని ధ్వజమెత్తారు. బెంగాల్‌లో ఇంత దారుణం జరిగినా ఎందుకు ప్రశ్నించలేదని మోడీ నిలదీశారు.