Leading News Portal in Telugu

Rameshwaram Cafe: సీసీటీవీలో భయానక పేలుడు దృశ్యాలు.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ వీడియోలు వైరల్..



Rameswaram Cafe

Rameshwaram Cafe: బెంగళూర్‌లో ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తి రెస్టారెంట్‌లో బ్యాగ్ వదిలిసి వెళ్లాడు. అందులో ఉన్న బాంబు పేలినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధ్రువీకరించారు. ఐఈడీని పేల్చేందుకు టైమర్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.

Read Also: Operation Valentine OTT: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’.. ఏ ఓటీటీలోకి వస్తుందంటే?

ఈ భయంకర పేలుడుకు సంబంధించిన దృశ్యాలు కేఫ్‌లోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం లంచ్ చేసే సమయంలో ముష్కరుడు బాంబు పెట్టినట్లు తెలుస్తోంది. అకాస్మత్తుగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా పొగతో నిండిపోయింది. చాలా మంది భయంలో బయటకు పరుగులు తీశారు. గాయపడిన వ్యక్తులు నేలపై పడి ఉండటం సీసీటీవీలో గమనించవచ్చు.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది గాయపడ్డారు. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర హోంమంత్రి సంఘటనా స్థలానికి వెళ్తున్నట్లు సీఎం చెప్పారు. మరోవైపు ఈ కేసును ఎన్ఐఏ విచారించే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించే పనిని ప్రారంభించారు. కేఫ్ పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు.