Leading News Portal in Telugu

Pakistan: ఓడ నుంచి “అణు సరుకు‌” స్వాధీనం చేసుకున్న భారత్.. పాకిస్తాన్ ఏం చెప్పిందంటే..?



Pak Cargo

Pakistan: అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణుల నిర్మాణానికి దోహదపడే సరుకుతో పాకిస్తాన్ వెళ్తున్న ఓడను భారత అధికారులు ముంబైలోని నవషేవా పోర్టులో అడ్డుకున్నారు. ఈ సరకు చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్తున్నట్లు తేలింది. అయితే, దీనిపై పాకిస్తాన్ స్పందించింది. వాస్తవాలను తప్పుడుగా చూపిస్తోందని పాక్ విదేశంగా కార్యలయం ఆదివారం పేర్కొంది. జనవరి 23న చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న ఓడ CMA CGM అట్టిలాను ముంబైలోని నవా షెవా పోర్ట్‌లో నిలిపివేశారు. ఈ ఓడలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్‌సీ) యంత్రాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అధికారులు కనుగొన్నారు.

Read Also: Balineni Srinivasa Reddy: పట్టాలు కరెక్ట్ కాదని నిరూపిస్తే పోటీ కూడా చేయను.. బాలినేని సవాల్

అణు కార్యక్రమాల్లో ఈ యంత్రాన్ని వాడుతారని తేలింది. యూరప్, అమెరికాల ద్వారా చైనా మార్గంలో పాకిస్తాన్ ఇలాంటి సరుకులు తీసుకువస్తోందని అనుమానిస్తున్నారు. అయితే, కరాచీకి చెందిన ఒక కంపెనీ కోసం కమర్షియల్ లాత్ మెషీన్‌ని రవాణా చేస్తోందని పాకిస్తాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఇది పాకిస్తాన్ ఆటోమొబైల్ పరిశ్రమకు విడిభాగాలను సరఫరా చేసే కరాచీకి చెందిన సంస్థకు లాత్ మిషన్‌ను దిగుమతి చేసుకుంటున్నాము. పరికరాల స్పెసిఫికేషన్ దాని పూర్తి వాణిజ్య వినియోగాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. లావాదేవీలు పారదర్శక బ్యాంకింగ్ మార్గాల ద్వారా నిర్వహించబడుతుంది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి’’ అంటూ పాకిస్తాన్ పేర్కొంది.

దీనిని భారత్ స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘన అని పాకిస్తాన్ చెప్పింది. వాణిజ్య వస్తువులను స్వాధీనం చేసుకున్న భారత్ వైఖరిని పాక్ ఖండిస్తోందని, ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి అంతరాయమని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఏకపక్ష చర్యలకు భారత్ పాల్పడిందని పాక్ విదేశాంగా కార్యలయం ప్రకటన విడుదల చేసింది.