
అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. కాలిఫోర్నియాలో (California) పబ్లిక్‌గా (Outdor party) జరుపుకుంటున్న వేడుకపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
సెంట్రల్ కాలిఫోర్నియాలోని కింగ్ సిటీలో ఏర్పాటు చేసిన ఓ అవుట్డోర్ పార్టీకి పలువురు హాజరయ్యారు. అంతలోనే ముసుగులు ధరించి.. కారులో అక్కడికి చేరుకున్న ముగ్గురు దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది.
ఇదిలా ఉంటే కాల్పుల అనంతరం దుండగులు అదే కారులో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.