Leading News Portal in Telugu

Jharkhand: సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ టూరిస్ట్‌కు రూ.10 లక్షల పరిహారం



Jharkhand

Jharkhand: శుక్రవారం(మార్చి 1) జార్ఖండ్‌లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ భర్తకు జార్ఖండ్ పోలీసులు రూ.10 లక్షల పరిహారం అందజేశారు. అత్యాచారానికి గురైన స్పానిష్ పర్యాటకురాలికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రూ.10 లక్షల (11,126.20 యూరోలు) పరిహారం అందించింది. ఆమె ఖాతాకు డబ్బు బదిలీ అయింది. చెక్కు కాపీని, నగదు బదిలీకి సంబంధించిన లేఖను బాధితురాలి భర్తకు దుమ్కా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డే, ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ అందించారు. జార్ఖండ్, దుమ్కా పోలీసులు తీసుకున్న సత్వర చర్యపై సామూహిక అత్యాచార బాధితురాలి భర్త సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏడుగురు ప్రమేయం ఉందని, ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. త్వరలో ఇతర నిందితులను కూడా అరెస్టు చేస్తామన్నారు. ఇది సంతృప్తిని కలిగించే అంశం. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలకు జార్ఖండ్ ప్రభుత్వానికి, పోలీసులకు బాధితురాలి భర్త కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Missile Attack: ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి.. భారతీయుడు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మార్చి 1వ తేదీ రాత్రి దుమ్కా జిల్లాలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఏడుగురు నిందితలు కలిసి ఈ ఘటనకు పాల్పడ్డారు. బాధితురాలిని, ఆమె భర్తను కొట్టి లాక్కెళ్లారు. అర్థరాత్రి, హన్స్‌దిహా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు బాధిత జంటను రోడ్డు పక్కన చూసి, వారిని స్థానిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు, వారిని మెరుగైన చికిత్స కోసం దుమ్కాలోని ఫూలోజనో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపారు. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తన భర్తతో కలిసి బైక్ టూర్‌కు వెళ్లిన స్పెయిన్‌కు చెందిన మహిళ రాష్ట్ర రాజధాని రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలో సామూహిక అత్యాచారానికి గురైందని, అక్కడ ఆమె తన భర్తతో పాటు డేరాలో రాత్రి గడుపుతుండగా ఈ దారణం జరిగిందని పోలీసులు తెలిపారు. స్పెయిన్‌కు చెందిన భార్యాభర్తలను దుండగులు కొట్టారని, అనంతరం బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది.

28 ఏళ్ల మహిళ, ఆమె 64 ఏళ్ల భర్త రెండు మోటార్‌సైకిళ్లపై బంగ్లాదేశ్‌ నుంచి దుమ్కా చేరుకున్నారు. బీహార్ మీదుగా నేపాల్ వెళ్లే మార్గంలో వారు బీహార్‌లోని భాగల్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ జంట టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి ఆసియాను చుట్టి మెగా ట్రిప్‌లో ఉన్నారు. ఈ జంట మొదట పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లి, దుమ్కాకు చేరుకుంది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేసేందుకు అఫిడవిట్ దాఖలు చేయాలని దుమ్కా ఎస్పీని ధర్మాసనం ఆదేశించింది. “ఒక విదేశీ పౌరుడిపై ఎలాంటి నేరం జరిగినా అది దేశ పర్యాటక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు తీవ్రమైన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను కలిగిస్తుంది. విదేశీ మహిళపై లైంగిక సంబంధిత నేరం దేశానికి వ్యతిరేకంగా ప్రతికూల ప్రచారాన్ని తెచ్చి తద్వారా కళంకం కలిగిస్తుంది.” అని కోర్టు పేర్కొంది.