Leading News Portal in Telugu

Tamil Nadu: బ్రైడ్ ఆఫ్ తమిళనాడు.. మళ్లీ అభాసుపాలైన స్టాలిన్ సర్కార్



Whatsapp Image 2024 03 05 At 4.26.25 Pm

తమిళనాడులో (Tamil Nadu) స్టాలిన్ సర్కార్ (CM Stalin Government) మరోసారి విమర్శల పాలైంది. ఇటీవలే భారత్ రాకెట్‌పై చైనా జెండా బ్యానర్ వేసి రాష్ట్రంలోని విపక్ష పార్టీల నుంచి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా మరో బ్యానర్‌ ఇప్పుడు విమర్శల పాలైంది.

తమిళనాడులో తాజాగా ప్రదర్శింపబడిన ఓ బ్యానర్ ఇప్పుడు పొలిటికల్‌గా రచ్చ రచ్చ చేస్తోంది. ఫ్రైడ్ ఆప్ తమిళనాడు అని రాయాల్సిన చోట బ్రైడ్ ఆప్ తమిళనాడు అంటూ రాశారు. దీంతో ఆ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ బ్యానర్ ఎందుకు? దేని కోసం ప్రదర్శించారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఆంగ్లం తెలియక ఇలా రాశారా? లేకుంటే ఉద్దేశపూర్వకంగానే ఇలా రాశారా? తెలియదు గానీ.. నెట్టింట మాత్రం చర్చ నడుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను తమిళనాడు పెళ్లి కూతురుగా అభివర్ణిస్తూ రాశారు. మరి పెళ్లికొడుకు ఏవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు వాళ్లకు ఆంగ్లంలో బాగానే పట్టు ఉందని.. వరుడు కూడా ఎవరో చెబితే బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

చైనా జెండాతో వివాదం
ఇటీవల డీఎంకే ప్రభుత్వం కులశేఖరపట్నంలో ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జరిగింది. అయితే దీన్ని పురస్కరించుకుని డీఎంకే ఒక పత్రిక ప్రకటన వేశారు. అందులో భారత్ రాకెట్‌పై చైనా జెండా ముద్రించారు. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అంతేకాకుండా ప్రతిపక్షాల నుంచి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడిచాయి. ఈ వివాదం సద్దుమణకముందే స్టాలిన్ సర్కార్ మరో వివాదంలో ఇరుక్కుంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

చైనా జెండా వివాదం వెలుగులోకి వచ్చిన వెంటనే బీజేపీ నేతలు, ప్రధాని మోడీ కూడా డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్‌ను ప్రచారం చేసే రాకెట్ ప్రకటనలో అధికార డీఎంకే పార్టీ ‘చైనా జెండా’ను ఉపయోగించడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మరోవైపు అంతరిక్ష రంగంలో భారత్‌ సాధించిన ప్రగతిని అంగీకరించేందుకు డీఎంకే సిద్ధంగా లేదంటూ ప్రధాని మోడీ ఆరోపించారు.