Leading News Portal in Telugu

Gujarat: గుజరాత్‌లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడ్‌బై



Dkdke

సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరుకానందుకు నిరసనగా ఓ ముఖ్య నేత హస్తం పార్టీని వీడారు. తాజాగా అదే కోవలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరారు. ఎమ్మెల్యే అరవింద్ లడానీ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర గుజరాత్‌లో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీని వీడడం ఇబ్బందికరంగానే మారింది.

గాంధీనగర్‌లోని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి అధికారిక నివాసంలో లడానీ తన రాజీనామాను సమర్పించారు. ఆపై తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అధికార పార్టీతో కలిసి ఉండటం అవసరమని వ్యాఖ్యానించారు. లడానీ రాజీనామాను శంకర్ చౌదరి ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం ధృవీకరించింది.

తాజా ఎదురుదెబ్బతో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 15 నెలలకే 182 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ బలం 13కి పడిపోయింది.

త్వరలోనే లడానీ బీజేపీలో చేరనున్నారు. జరగబోయే ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీలో ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు.

2022 అసెంబ్లీ ఎన్నికలలో 3,400 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో లడానీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి జవహర్ చావ్డాపై విజయం సాధించారు. 2022లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 17 మందిలో లడానీ ఒకరు. కేవలం మూడు నెలల వ్యవధిలో పార్టీకి వీడ్కోలు పలికిన నాలుగో కాంగ్రెస్ శాసనసభ్యుడు లడానీ.

రెండు రోజుల క్రితం, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మరియు గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ మోద్వాడియా అన్ని పదవులకు రాజీనామా చేసి మంగళవారం బీజేపీలో చేరారు. అతని కంటే ముందు ఖంభాట్ ఎమ్మెల్యే చిరాగ్ పటేల్, విజాపూర్ ఎమ్మెల్యే సిజె చావ్డా కూడా కాంగ్రెస్ శాసనసభ్యుల పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.