Leading News Portal in Telugu

Lok Sabha Polls: బీజేడీతో బీజేపీ పొత్తు..? మోడీ టూరే సంకేతమా?



Naveen

ప్రధాని మోడీ (PM Modi) దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో పర్యటించేటప్పుడు స్థానిక ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఒడిషా పర్యటనలో మాత్రం అలాంటి వ్యాఖ్యలు కనిపించలేదు. దీంతో నవీన్ పట్నాయక్‌తో బీజేపీ పొత్తు (BJP-BJD alliance in Odisha) పెట్టుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik).. ఇప్పటికే వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. మరోసారి కూడా ఆయనే సీఎం అవుతారంటూ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒడిశాలో బిజూ జనతాదళ్‌తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? అంటే అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2019 ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, ఒక సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి కూడా బీజేడీ, బీజేపీ మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోటీ ఉంటుంది. అయితే బీజేడీ 11, బేజీపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ మంగళవారం ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను బలంగా చెప్పారు. అయితే తన ప్రసంగంలో ఎక్కడా బిజూ జనతాదళ్‌ను కానీ, నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదు. బీజేడీ విషయంలో మోడీ మౌనం వెనుక ఒడిశాలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.