Leading News Portal in Telugu

Congress: బ్యాంకు ఖాతాలపై చర్యల నిలిపివేతకు కోర్టు నిరాకరణ



Ckden

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు (Congress) భారీ షాక్‌ తగలింది. తమ బ్యాంకు ఖాతాలపై ఐటీ శాఖ చర్యల నిలిపివేతకు న్యాయస్థానం నిరాకరించింది. కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభ్యర్థనను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ తిరస్కరించింది.

తమ బ్యాంకు ఖాతాల (Bank Accounts)పై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆదాయపు పన్ను (Income Tax) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ కొట్టివేసింది. అయితే హైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పుపై 10 రోజుల పాటు స్టే విధించాలని హస్తం పార్టీ అభ్యర్థించింది. దీన్ని కూడా ట్రైబ్యునల్‌ తిరస్కరించింది.

2018-19 సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నుల విషయంలో ఆదాయపు పన్ను విభాగం గతంలో కాంగ్రెస్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. వీటికి పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఐటీ విభాగం.. ఇటీవల రూ.210 కోట్ల పన్ను రికవరీ నిమిత్తం కాంగ్రెస్‌కు చెందిన పలు ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసింది. దీనిపై పార్టీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో స్వల్ప ఊరట లభించింది.

దీనిపై తదుపరి విచారణ చేపట్టేంతవరకు బ్యాంకు ఖాతాలను యథావిధిగా నిర్వహించుకునేందుకు ట్రైబ్యునల్‌ అనుమతినిచ్చింది. దీంతో ఆ అకౌంట్లను పునరుద్ధరించారు. అయితే ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉండగానే ఇటీవల ఐటీ అధికారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి రూ.65కోట్లు విత్‌డ్రా చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. తమ అకౌంట్లపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం కాంగ్రెస్‌ అభ్యర్థనను కొట్టివేసింది. దీనిపై కాంగ్రెస్‌ ట్రెజరర్‌ అజయ్‌ మాకెన్‌ స్పందించారు. ట్రైబ్యునల్‌ తీర్పుపై న్యాయపరమైన చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని వెల్లడించారు.