Leading News Portal in Telugu

Karnataka: పాక్ మద్దతుదారుల్ని కాల్చిపారేయాలి.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..



Rajanna

Karnataka: ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యకర్త ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో రచ్చకు కారణమయ్యాయి. అయితే, తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న స్పందించారు. అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసేవారిని కాల్చిచంపాలని శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుస్సేన్ విజయం సాధించిన తర్వాత అతని మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.

దీనిపై కేఎన్ రాజన్న స్పందిస్తూ..‘‘కాంగ్రెస్ ఇమేజ్ బాగానే ఉంది. ఎవరైనా నినాదాలు చేసినా, పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చినా.. ఆ వ్యక్తని కాల్చి చంపండి. అందులో తప్పులేదు’’ అని రాజన్న అన్నారు. కర్ణాటక మంత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లో బుల్డోజర్ యాక్షన్‌కి మద్దతు ఇచ్చారు. బుల్డోజర్లను ఉపయోగించి అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చిందని అన్నారు.

Read Also: Lok Sabha Elections: ఈసీని కలిసిన ఓపెన్ఏఐ అధికారులు.. ఏఐ దుర్వినియోగంపై చర్చ..

ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల ఫలితా అనంతరం పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఈ కేసులో వాస్తవికతను తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ద్వారా దర్యాప్తు చేయాలని సిద్ధరామయ్య ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తికి రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చూపే ఫోటోలను బీజేపీ బయటపెట్టింది.

ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ నసీర్ హుస్సేన్ పేరును కూడా చేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు అతడిని రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి అనుమతించవద్దని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్‌ని బీజేపీ కోరింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27 ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కన్నడిగులు, ప్రతీ భారతీయుడిని అవమానించడమే అని అన్నారు.