Leading News Portal in Telugu

Rajasthan : 48గంటల పాటు పెట్రోల్ బంకులు బంద్



Petrol Rates

Rajasthan : రాజస్థాన్‌లో రానున్న రెండు రోజులు చాలా కష్టతరంగా మారనున్నాయి. రాష్ట్ర పెట్రోల్‌ పంపుల సంఘం సమ్మెను ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు మరో రెండు రోజులు మూతపడనున్నాయి. మార్చి 10వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఈ సమ్మె ప్రారంభమైంది. మరో 48 గంటలపాటు సమ్మె కారణంగా డీజిల్, పెట్రోల్ కొనుగోలు, అమ్మకాలు జరగడం లేదు. వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పంప్ ఆపరేటర్ల ఈ సమ్మె చేస్తున్నారు.

మార్చి 10వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమ్మె మార్చి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 6827 పెట్రోల్‌ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వ్యాట్ తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, అయితే ప్రధాని హామీ ఇచ్చినా రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదని అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర చెప్పారు. అలాగే చమురు కంపెనీలు డీలర్ కమీషన్ పెంచలేదు.

Read Also:Road Accident : కారు – ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఈ విషయమై మార్చి 8న రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఇందులో అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, ఆర్పీడీఏ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించకపోవడం, గత 7 ఏళ్లుగా చమురు కంపెనీలు డీలర్‌ కమీషన్‌ పెంచకపోవడం, లూబ్‌ ఆయిల్‌, ప్రీమియం ఉత్పత్తులను బలవంతంగా సరఫరా చేయడంపై చర్చలు జరిగాయి.

‘నో పర్చేజ్ నో సేల్’ సమ్మె ప్రకటన
పెట్రోల్ పంప్ అసోసియేషన్ సమ్మె కారణంగా, రాష్ట్రంలోని పెట్రోలియం డీలర్లు ఎలాంటి ఇంధనాన్ని కొనుగోలు చేయరు లేదా విక్రయించరు. అలాగే మార్చి 11వ తేదీ సోమవారం జైపూర్‌లో కూడా ప్రదర్శన నిర్వహించనున్నట్లు సంఘం తెలిపింది. ఈ సందర్భంగా స్టాచ్యూ సర్కిల్ నుంచి సచివాలయం వరకు డీలర్లంతా మౌన ర్యాలీ నిర్వహిస్తారు. రాబోయే 48 గంటలపాటు “నో పర్చేజ్ నో సేల్” సమ్మెను ప్రకటించినట్లు రాజస్థాన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కోశాధికారి సందీప్ బగేరియా తెలిపారు.

Read Also:Ooru Peru Bhairavakona : ఓటీటీలో దూసుకుపోతున్న సందీప్ కిషన్ ఫాంటసీ మూవీ..

పొరుగు రాష్ట్రాల్లో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తక్కువ
ఎన్నికల సమయంలో భాజపా ఈ అంశాన్ని లేవనెత్తిందని, డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటి వరకు దీనిపై చర్చ జరగలేదని సంఘం అధికారి ఒకరు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో డీజిల్-పెట్రోలు చౌకగా లభిస్తాయని, అయితే రాజస్థాన్‌లో ఇది ఖరీదైనదని అధికారి తెలిపారు.

పెట్రోల్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు
ఇక్కడ పెట్రోల్‌ పంపుల సంఘం సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ కోసం ఇంటింటికీ తిరుగుతున్నారు. వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె వల్ల తమ పనులపై ప్రభావం పడుతుందని, పనులకు రాలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. వీలైనంత త్వరగా పెట్రోల్‌ పంపు తెరవాలని ప్రజలు కోరుతున్నారు.