Leading News Portal in Telugu

Lok Sabha Elections: ఈసీని కలిసిన ఓపెన్ఏఐ అధికారులు.. ఏఐ దుర్వినియోగంపై చర్చ..



Ai

Lok Sabha Elections: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. వారంలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్క భారతదేశమే కాకుండా అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి.

Read Also: Keshineni Nani: టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్..

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దుర్వినియోగంపై అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాట్ జీపీటీ మేకర్ అయిన ఓపెన్ఏఐ అధికారులు కేంద్ర ఎన్నికల అధికారులను కలిశారు. గత నెలలో జరిగిన సమావేశంలో దేశంలో లోక్‌సభ ఎన్నికల్లో ఏఐ దుర్వినియోగం కాకుండా చూసేందుకు తాము తీసుకుంటున్న చర్యల గురించి ఓపెన్ఏఐ అధికారులు ఈసీకి వివరించారు.

ఓపెన్ఏఐ, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా టెక్ దిగ్గజాలు ఓటర్లను తప్పుదారి పట్టింకుండా చర్యలు తీసుకుంటామని చెప్పాయి. హానికరమైన ఏఐ కంటెంట్‌ని ఎదుర్కొనేందుకు సాంకేతికతను ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్లాట్‌ఫారమ్స్‌లతో మోసపూరిత ఎన్నికల విషయాలను గుర్తించి, పరిష్కరించేందుకు కొత్త మార్గాలను అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తామని కంపెనీలు తెలిపాయి. జర్మనీ మ్యూనిచ్‌లో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా 20 టెక్ దిగ్గజాలు ఒప్పందంపై సంతకం చేశాయి. వీటిలో ఎక్స్, టిక్‌టాక్, స్నాప్, అడోబ్, లింక్డ్ఇన్, ఐబీఎం వంటి ఉన్నాయి.