
Gym trainer Murder: ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్(29)ని అతని తండ్రి రంగ్లాల్(54) దారుణంగా హత్య చేశాడు. గౌరవ్ పెళ్లికి కొన్ని గంటల ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులకు విస్తూపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఇంత వరకు కొడుకు తిడుతున్నాడనే కోపంతోనే గౌరవ్‌ని హత్య చేశాడని భావిస్తున్నప్పటికీ, మరో విషయం వెలుగులోకి వచ్చింది. భార్య తనను విడిచిపెట్టిందనే కోపంతోనే కొడుకును పెళ్లి రోజే చంపినట్లు రంగలాల్ పోలీసులకు వెల్లడించారు. ఈ హత్యకు మూడు నాలుగు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్లు తేలింది.
Read Also: Congress-DMK: తమిళనాట డీఎంకే-కాంగ్రెస్-కమల్‌హాసన్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు..
ఫిబ్రవరి 6-7 తేదీ అర్థరాత్రిలో గౌరవ్ సింఘాల్‌ని రంగలాల్ ముఖం, ఛాతిపై కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య తర్వాత అక్కడ నుంచి జైపూర్ పారిపోయాడు. అక్కడే అతడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. తెల్లవారితే గౌరవ్ పెళ్లి, ఈ లోపే దారుణం జరగడంతో ఢిల్లీలో ఈ కేసు సంచలనంగా మారింది. భార్య, కొడుకుతో రంగలాల్ సంబంధాలు సరిగా లేవని తేలిందని, తండ్రి తన భార్యకు గుణపాఠం చెప్పేందుకే కొడుకును హత్య చేసినట్లు సౌత్ ఢిల్లీ డీసీపీ అంకిత్ చౌహాన్ వెల్లడించారు.
నిందితుడు కుటుంబ సభ్యులకు ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రూ. 75,000 చెల్లించి ముగ్గురు సహచరులను నియమించుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి కొడుకు, తండ్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో గౌరవ్ తన తండ్రి రంగలాల్ని చెంపపై కొట్టాడు. దీంతో హత్య జరిగింది. కొడుకు హత్యపై అతను ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని, తన కుమారుడి విపరీత జీవనశైలి, అవిధేయతతో తాను అసంతృప్తి చెందినట్లు నిందితుడు వెల్లడించాడు. తల్లి కూడా తన కుమారుడికి ఎప్పుడూ మద్దతు ఇస్తుందని, దీంతో అతడిలో నిరాశ పెరిగిందని డీసీపీ చౌహాన్ తెలిపారు. అరెస్ట్ చేసే సమయంలో అతని వద్ద రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు ఉన్నాయని, వాటితో ఇంటి నుంచి పారిపోయాడని అధికారులు తెలిపారు.