Leading News Portal in Telugu

Maharashtra: ఎన్నికల వేళ ఏక్‌నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం



Maha

సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి మారాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

మహిళలకు పెద్ద పీటవేస్తూ సోమవారం మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డ్‌లు వంటి అన్ని ప్రభుత్వ పత్రాలపై తల్లి పేరు తప్పనిసరిగా ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మే 1, 2024 నుంచే అమలులోకి వస్తుందని తీర్మానించింది.

త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వంట గ్యాస్ ధరను రూ.100లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం బిల్లును అమల్లోకి తెచ్చింది. ఇలా ఆయా వర్గాలను మచ్చిక చేసుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇటీవల మహారాష్ట్ర సర్కార్.. ఎప్పుట్నుంచో పెండింగ్‌లో ఉన్న మరాఠా బిల్లును ప్రత్యేక శాసనసభ నిర్వహించి ఆమోదించింది. ఈ బిల్లుతో మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ లభించనుంది. తాజాగా నారీమణులకు పెద్ద పీట వేస్తూ అన్ని ప్రభుత్వ పత్రాల్లో పేరు ఉండేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ వారంలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. పైగా సోమవారం సీఏఏ బిల్లును కేంద్రం ఆమోదించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నోటిఫికేషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.