
ఏ సంస్థలో పని చేసినా వారానికి ఒక రోజు వీక్లీ ఆప్ ఉంటుంది. అలాగే సెలవులు ఉంటాయి. ఆయా పరిస్థితులను బట్టి సెలవులను ఉపయోగించుకుంటారు. కచ్చితంగా వీక్లీ ఆఫ్‌లు కూడా వాడుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఒక ఉద్యోగి మాత్రం 26 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పని చేస్తే.. కేవలం ఒక్కరోజు అంటే ఒక్క రోజే సెలవు తీసుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. అతనెవరో.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన తేజ్‌పాల్ సింగ్ అనే క్లర్క్.. 26 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేసి ఉద్యోగం పట్ల అంకితభావంతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో తన పేరును నమోదు చేసుకున్నాడు. డిసెంబర్ 26, 1995 నుంచి ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు. అంతే తప్ప.. మళ్లీ ఎప్పుడూ సెలవు పెట్టలేదు. దీంతో సింగ్ సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.
వాస్తవానికి సింగ్‌కి 45 రోజుల వార్షిక సెలవులను కంపెనీ అందించింది. కానీ అతడు 2003లో తన తమ్ముడి వివాహానికి హాజరు కావడానికి ఒక్క రోజు తప్ప.. ఇంకెప్పుడూ సెలవు దినాన్ని ఉపయోగించలేదు. 26 ఏళ్ల సర్వీస్‌లో ఒక్క రోజే సెలవు తీసుకోవడంతో స్థానిక మీడియాలో సింగ్ హీరోగా నిలిచిపోయాడు. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత మరియు అంకితభావం కారణంగా అతను ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో పేరు నిలుపుకున్నాడు.
తేజ్‌పాల్ సింగ్‌కు భార్య, ఇద్దరు తమ్ముళ్లతో సహా తన పెద్ద కుటుంబంతో బిజ్నోర్ జిల్లాలో నివసిస్తున్నాడు. సింగ్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబ అవసరాలు మరియు హోలీ, దీపావళి వంటి పండుగలు ఉన్నప్పటికీ.. ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా సమయానికి డ్యూటీకి హాజరయ్యాడు. ఇలా కంపెనీ మన్ననలతో పాటు ఇప్పుడు సరికొత్త రికార్డ్ సృష్టించి చరిత్రలో నిలిచిపోయాడు.