Leading News Portal in Telugu

Electoral Bonds: దిగొచ్చిన ఎస్‌బీఐ! ఈసీకి డేటా అప్పగింత



Sbi

మొత్తానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం సాయంత్రం ఎలక్టోరల్ బాండ్ల గురించిన డేటాను భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. సుప్రీంకోర్టు కఠినమైన ఆదేశాల మేరకు ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఈసీకి ఎస్‌బీఐ సమర్పించింది.

ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో భారతీయ స్టేట్‌ బ్యాంకు దిగివచ్చింది. ఎన్నికల బాండ్ల రూపంలో దేశంలోని పలువురు రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల సంఘం కూడా ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంది.

ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్‌ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మార్చి 11న విచారించింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన న్యాయస్థానం.. సమాచారం అందుబాటులో ఉన్నా ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుబడుతూ బ్యాంకు అభ్యర్థనను కొట్టివేసింది.

మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ మంగళవారం సాయంత్రం ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది.

2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికింద ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో దాదాపు 28 వేల బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లు. అయితే ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీలు పిల్‌లు దాఖలు చేశాయి. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటల కల్లా వెబ్‌సైట్‌లో ఈసీ వివరాలను ఉంచనుంది.