Tamil Nadu: “నేను మంత్రిని కాకుంటే అతడిని ముక్కలు చేసేవాడిని”.. ప్రధాని మోడీకి డీఎంకే మంత్రి బెదిరింపులు..

Tamil Nadu: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన తమిళనాడు మంత్రిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికార డీఎంకే పార్టీకి చెందిన నేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో వివాదాస్పదం అయ్యాయి. మంత్రి అన్బరసన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో అధికార డీఎంకేపై బీజేపీ విరుచుకుపడుతోంది.
‘‘మేము చాలా మంది ప్రధానమంత్రులను చూశాం. కానీ ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడే ప్రధానిని చూడలేదు. మనల్ని నిర్మూలిస్తానని అంటాడు. నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, డీఎంకే ఒక సాధారణ సంస్థ కాదు, ఇది చాలా మంది త్యాగం, రక్తాన్ని చిందించడం ద్వారా నిర్మించబడింది, డీఎంకేని నాశనం చేస్తానన్న వాళ్లు మరణించారు. ఈ సంస్థ ఎప్పటికీ ఉన్నతంగా నిలుస్తుంది, దానిని గుర్తుంచుకోండి. దీన్ని వేరే చోట చూపేందుకు ప్రయత్నించండి. నేను మంత్రిని కాకపోతే, మిమ్మల్ని చీల్చివేస్తాను, నేను మంత్రిని కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నాను, నేను మంత్రిగా ఉండకపోతే ఆయన్ని ముక్కలు చేసి ఉండేవాడిని’’ అంటూ మంత్రి అన్బరసన్ బెదిరింపులకు పాల్పడ్డారు.
Read Also: Star Hospitals: గచ్చిబౌలిలోని స్టార్ హాస్పిటల్స్‌లో ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకలు
తమిళనాడులోని తిరుప్పూర్‌లో ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించిన వారం తర్వాత నాలుగు రోజుల క్రితం డీఎంకే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అన్బరసన్ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండించింది. ప్రధాని మోడీని బెదిరించినందుకు అతడిని తొలగించాలని సీఎం స్టాలిన్‌ని డిమాండ్ చేశారు. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఎజెండా మరింత స్పష్టమైంది, సనాతన ధర్మాన్ని రక్షించే ప్రతీ ఒక్కరిని నిర్మూలించండి అంటూ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి అధమస్థాయి దిగజారిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ.. ప్రధాని ఎందుకు వస్తున్నారని సీఎం ట్వీట్ చేశారు, కాబట్టి తమిళనాడులో ప్రధాని పర్యటనలకు వారు భయపడి ఉండొచ్చని, అందుకే ప్రధాని గురించి ఇంత హీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఒక బాధ్యత కలిగిన సీఎంగా, ఈ దేశ ప్రధానిని బెదిరించే ప్రయత్నం చేసినందుకు స్టాలిన్ సదరు మంత్రిని తొలగించాలని ఆయన అన్నారు.