Leading News Portal in Telugu

Mamata: సోదరుడితో బంధాలు తెంచుకున్న మమత.. అసలేం జరిగిందంటే..!



Mamatha

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సోదరుడు బాబుల్‌తో రక్తసంబంధాన్ని తెంచుకున్నారు. ఈ మేరకు మమత ప్రకటించారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై బాబుల్‌ బెనర్జీ అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుల్‌తో అన్ని బంధాలను తెంచుకున్నట్లు తెలిపారు. బాబుల్‌.. మమతకు సోదరుడు. ఇతను బీజేపీతో సన్నిహితంగా ఉన్నట్లు తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది.

మా కుటుంబం.. బాబుల్‌తో అన్ని బంధాలను తెంచుకున్నామని మమత ప్రకటించారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఏదో సమస్య సృష్టిస్తారని.. అత్యాశపరులు తనకు ఇష్టముండదన్నారు. బీజేపీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. బాబుల్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదని సోదరుడిని ఉద్దేశిస్తూ మమత వ్యాఖ్యానించారు. హావ్‌డా లోక్‌సభ స్థానాన్ని ప్రసూన్‌ బెనర్జీకి తిరిగి కేటాయించడంపై బాబుల్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇక లోక్‌సభ ఎన్నికల ముందు సీఏఏను తీసుకురావడాన్ని మమత తప్పుపట్టారు. ఇదంతా ఓ రాజకీయ జిమ్మిక్కు అంటూ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. పౌరసత్వ సవరణ చట్టానికి జాతీయ పౌర పట్టికతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అస్సాం మాదిరిగా పశ్చిమబెంగాల్‌లో శరణార్థి శిబిరాలను కోరుకోవడం లేదన్నారు.

ఇక సీఏఏపై పలు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోన్న వేళ కేంద్ర హోంశాఖ స్పందించింది. చట్టం అమలుపై భారత్‌లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని.. హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019ను అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి మార్చి 11న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది. అంతేకాదు హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేసింది. ఇంకోవైపు దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి.