
BJP: 2024 లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహాలు రూపొందిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాలను క్రాస్ చేస్తుందని ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. ఢిల్లీలో ఆప్‌తో బీజేపీ పోటీ పడబోతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో అభ్యర్థుల విషయంలో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. ఏడు స్థానాల్లో ఒకరిని మినహా అందరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించింది. ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీకే మళ్లీ టికెట్ లభించింది.
మార్చి 3న తొలి జాబితాలో నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించారు. పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నుంచి పర్వేశ్ వర్మ, దక్షిణ ఢిల్లీ నుంచి రమేష్ బిధూరి, న్యూఢిల్లీ నుంచి మీనాక్షి లేఖి, చాందినీ చౌక్ నుంచి హర్షవర్ధన్‌లకు టికెట్ నిరాకరించి, వారి స్థానంలో న్యూఢిల్లీ నుంచి మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్‌ని పోటీకి దింపింది. చందానీ చౌక్‌లో బీజేపీ అభ్యర్థిగా లోక్ ప్రవీణ్ ఖండేల్వాల్, పశ్చిమ ఢిల్లీ స్థానానికి కమల్‌జీత్ సెహ్రావత్, దక్షిణ ఢిల్లీకి రాంవీర్ సింగ్ బిధూరిని పార్టీ ఎంపిక చేసింది.
Read Also: BRS: మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్.. ఎవరంటే?
ఈ రోజు ప్రకటించిన రెండో జాబితాలో తూర్పు ఢిల్లీ స్థానానికి హర్షమల్హోత్రాను ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎంపీగా ఉన్నారు. వాయువ్య ఢిల్లీ స్థానానికి యోగేంద్ర చందోలియాను ప్రకటించింది.
మరోవైపు ఈసారి బీజేపీని ఢీకొట్టేందుకు ఢిల్లీలో ఇండియా కూటమి తరుపున ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలోని నాలుగు స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని, మిగిలిన మూడు స్థానాలైన చాందినీ చౌక్, ఈశాన్య, వాయువ్య ఢిల్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఇండియా కూటమి ప్రకటించింది. ఆప్ తరుపున న్యూఢిల్లీ నుంచి సోమనాథ్ భారతి, పశ్చిమ ఢిల్లీలో మహాబల్ మిశ్రా, తూర్పు ఢిల్లీ నుంచి కుల్దీప్ కుమార్, దక్షిణ ఢిల్లీ నుంచి సహిరామ్ పేర్లను ఆప్ ప్రకటించింది. కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థులను ప్రకటించలేదు.