
సార్వత్రిక ఎన్నికల వేల కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఆదాయపు పన్ను వివాదంలో న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. ఆదాయపు పన్ను శాఖ నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది.
2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నుల విషయంలో ఆదాయపు పన్ను విభాగం గతంలో కాంగ్రెస్కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఐటీ విభాగం.. పన్ను రికవరీ నిమిత్తం ఇటీవల పార్టీకి నోటీసులు జారీ చేసింది. ఆ మదింపు సంవత్సరానికి పార్టీ చెల్లించాల్సిన వాస్తవ పన్ను డిమాండ్ రూ.102 కోట్లు కాగా.. వడ్డీతో కలిపి అది రూ.135.6 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.65.94 కోట్లను ఇటీవల ఐటీ అధికారులు రికవరీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ అకౌంట్లపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నోటీసులపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్లో పిటిషన్ వేసింది. ఇందుకు ట్రైబ్యునల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది.
తమ బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారని న్యాయస్థానానికి తెలిపింది. తమకు ఊరట కల్పించాలని… లేకుంటే పార్టీ కుప్పకూలుతుందని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చింది. రికవరీ నోటీసులు చట్టబద్ధంగానే ఉన్నాయని.. ఇందులో మేం జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో హస్తం పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
ఎన్నికల వేళ కాంగ్రెస్కు ఇది ఇబ్బందిగానే మారింది. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆదాయ పన్ను శాఖతో ఇబ్బందులు తలెత్తడంతో హస్తం పార్టీ ఇబ్బందుల్లో పడింది. ఈ వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం చేస్తుందో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఇప్పటివరకూ.. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రెండు దఫాలుగా విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులో 39, సెకండ్ లిస్టులో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక మూడో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు చేసింది.