
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు విడిపోయినట్లు డ్రామాలు ఆడుతున్నాయని, అయితే రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బుధవారం పొల్లాచ్చిలో జరిగిన డీఎంకే సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏఐడీఎంకే తమ పొత్తు చెడిపోయిందని చెబుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, వారి మధ్య రహస్య సంబంధం ఉందని ఆరోపించారు.
Read Also: BRS: మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన.. ఎవరంటే?
ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తన పార్టీకి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగం కాబోదని ప్రకటించిన వారాల తర్వాత స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమిళనాడుకి డీఎంకే ప్రభుత్వం నిలిపేసిన కేంద్ర పథకాలను చూపించాలని ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. తమిళనాడుకు ఏ ప్రత్యేక పథకాలను తీసుకువచ్చారని ప్రధాని మోడీని అడగాలని ప్రజలను కోరారు. డీఎంకే హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని ప్రధాని ఆరోపించిన నేపథ్యంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.