
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రధాని మోడీ ఎన్డీఏ కూటమి పక్షాన కేరళలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోడీ మాట్లాడారు.
అవినీతి, అసమర్థ ప్రభుత్వాల వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని విమర్శించారు. ఈసారి కేరళలో కమలం వికసించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేరళలోని వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. అవినీతి, అసమర్థతతో కొట్టుమిట్టాడుతున్న ఆయా ప్రభుత్వాల హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు పోతేనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో కేరళ ప్రజలు బీజేపీకి రెండంకెల ఓట్ల శాతమే మద్దతు తెలిపారని.. వచ్చే ఎన్నికల్లో మాత్రం రెండంకెల సీట్లు అందించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయని మోడీ విమర్శించారు.
ప్రధాని మోడీ గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో అన్ని ప్రాంతాలను కవర్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుట్టారు. ఇంకొన్ని చోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఇప్పటికే రెండు విడతలుగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 195 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులను వెల్లడించింది. మూడో జాబితాను కూడా త్వరలోనే బీజేపీ విడుదల చేయనుంది. ఇందుకోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్కు చెందిన ముఖ్య నేతలంతా బీజేపీ గూటికి చేరుతున్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని.. ఎన్డీఏ కూటమి అయితే 400 సీట్లకు పైగా స్థానాలు సొంతం చేసుకుంటుందని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.