Leading News Portal in Telugu

Flipkart: అతని ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు.. రూ.10,000 చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌కి ఆదేశం..



Flipkarat

Flipkart: ఐఫోన్ ఆర్డర్‌లో తలెత్తిన వివాదంలో ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)కి వినియోగదారుల ఫోరమ్ జరిమానా విధించింది. ఒక వ్యక్తి ఐఫోన్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసినందుకు, బాధితుడు అనుభవించిన మానసిక క్షోభకు పరిహారంగా రూ.10,000 చెల్లించాలని ఫోరమ్ ఫ్లిప్‌కార్ట్‌ని ఆదేశించింది. ఈ క్యాన్సిల్ ఉద్దేశపూర్వకంగా అదనపు లాభాన్ని ఆర్జించడం కోసం చేశారని, ఇది సర్వీస్‌లో లోపమని, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ అన్యాయమైన వ్యాపార పద్దతులను పాటించిందని సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పేర్కొంది.

కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ తర్వాత రీఫండ్ అందుకున్నప్పటికీ, ఏకపక్షంగా రద్దు చేయడంతో ఆయన మానసిక క్షోభ అనుభవించాడని దానికి పరిహారం చెల్లించాల్సిందే అని కమిషన్ ఆదేశించింది. దాదార్ నివాసి జూలై 10,2022న ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్(iPhone) ఆర్డర్ చేశాడు. ఇందుకు తన క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ. 39,628 చెల్లించాడు. జూలై 12న ఫోన్ డెలివరీ కావాల్సి ఉండగా.. ఆరు రోజుల తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అయిందని ఇ-కామర్స్ సంస్థ నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది.

అయితే, బాధితుడు ఎందుకు క్యాన్సిల్ అయిందని ఎక్వైరీ చేసినప్పుడు.. తమ Ekart డెలివరీ బాయ్ ఐఫోన్ డెలివరీ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, అయితే మీరు అందుబాటులో లేరని, అందువల్ల ఆర్డర్ క్యాన్సిల్ అయిందని కంపెనీ చెప్పింది. ఆర్డర్ రద్దు కావడం వల్ల నష్టం, మానసిక క్షోభ మాత్రమే కాకుండా ఆన్‌లైన్ మోసానికి గురయ్యానని ఫిర్యాదుదారు తెలిపారు.

Read Also: S Jaishankar: సీఏఏపై అమెరికా అత్యుత్సాహం.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన జైశంకర్..

తాము కేవలం ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తున్నామని, ఫ్లాట్‌ఫారమ్ లోని అన్ని ఉత్పత్తులు ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ విక్రేతలు విక్రయిస్తారని, సరఫరా చేస్తున్నట్లు కంపెనీ చెప్పింది. ఫిర్యాదుదారు మనోవేదనను విక్రేతను తెలియజేసినట్లు కంపెనీ పేర్కొంది. డెలివరీ సమయంలో ఫిర్యాదుదారు అందుబాటులో లేకపోవడంతోనే ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. డబ్బు వాపస్ చేశామని, ఇక్కడ విక్రేత, ఫిర్యాదుదారు మధ్య మాత్రమే వివాదం ఉందని, ఫ్లిప్‌కార్ట్‌పై ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది.

ఇదిలా ఉంటే ఇ-కామర్స్ ఏకపక్షంగా కంపెనీ ఆర్డర్ క్యాన్సి్ల్ చేసిందని వినియోగదారుల ఫోరం గుర్తించింది. ఈ ఆర్డర్ రద్దు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ అంగీకరించిందని, ఫిర్యాదుదారు తాజాగా ఆర్డర్ చేయాల్సిందిగా కోరినట్లు కమిషన్ పేర్కొంది. ఆ సమయంలో ప్రోడక్ట్ ధర సుమారు రూ. 7000 పెరిగిందని, అందువల్ల ఆర్డర్ రద్దు చేయబడిందని, మరోసారి ఆర్డర్ చేయాల్సిందిగా కోరినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. ఫ్లిప్ కార్ట్ ఉద్దేశపూర్వకంగానే అదనపు లాభాన్ని ఆర్జించడానికి ఇలా చేసిందని, ఇది సర్వీస్ లోపమని, ఇది అన్యాయమని కమిషన్ పేర్కొంది. ఫిర్యాదుదారుడు అనుభవించిన మానసిక వేధింపులు మరియు వేదనకు పరిహారంగా ₹ 10,000 మరియు ఖర్చుల కోసం ₹ 3,000 చెల్లించాలని కమిషన్ ఫ్లిప్‌కార్ట్‌ని ఆదేశించింది.