Leading News Portal in Telugu

Karnataka: కాంగ్రెస్ గూటికి మాజీ ముఖ్యమంత్రి.. బీజేపీకి కీలక నేత షాక్!



Ex Cm

సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా పార్టీల నుంచి నేతలు ఇటు అటు జంప్ అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడడం.. ఇంకోవైపు టికెట్లు లభించకపోవడంతో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారిపోతున్నారు. తాజాగా ఈ చేరికలు మరింత స్పీడ్ అందుకున్నాయి.

ఇదిలా ఉంటే కర్ణాటక కీలక పరిణామం చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో సదానంద గౌడ పేరు లేదు. దీంతో ఆయన అలకబూనారు. దీంతో భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి సదానంద గౌడ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. తన తదుపరి రాజకీయ కార్యాచరణను మంగళవారం ఉదయం ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది.

సోమవారం సదానంద గౌడ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆయన మద్దతుదారులు భారీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. తనను కాంగ్రెస్ నేతలు సంప్రదించారని ఆయన వెల్లడించారు. హస్తం పార్టీ ఆయనకు బెంగళూరు నార్త్‌తో పాటు మైసూర్‌-కొడగు స్థానాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో సదానంద గౌడ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇది కూడా చదవండి:YS Jagan: 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలి..