
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. నాగ్‌పాల్ స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు జ్యుడీషియల్ సర్వీసెస్‌లో మరో 26 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
ఈ కేసులో ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం గమనార్హం. మనీష్ సిసోడియా గతేడాది నుంచి జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకూ ఆయనకు బెయిల్ లభించలేదు. మరో వైపు ఇదే కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను వెంటాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఆప్‌కు గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. తాజాగా తొమ్మిదో సారి కూడా ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీనిపై హైకోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
ఇదిలా ఉంటే రాజకీయ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్‌ను ఈడీ వెంటాడుతోందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. సీబీఐ ద్వారా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆప్ మంత్రులు విమర్శిస్తున్నారు. హైకోర్టులో బుధవారం జరగనున్న విచారణపై ఆప్ దృష్టి పెట్టింది. ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: Fraud: కంపెనీ సొమ్మును సొంత ఖాతాలకు బదిలీ.. అకౌంటెంట్ అరెస్ట్
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవితను మార్చి 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. మరోవైపు కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. అలాగే పలువురు ముఖ్య నేతలు కూడా కలిసినట్లు తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యులు కూడా కవితను కలిసేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: Prime Video: అమెజాన్ ప్రైమ్ అనౌన్స్ చేసిన 64+ కంటెంట్ లిస్ట్ ఇదే
కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ-రూపకల్పనలో వీరంతా భాగస్వాములని ఈడీ వెల్లడించింది. ఇందులో భాగంగానే కవిత రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారని ఈడీ తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు 2022లో వెలుగు చూసింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా 245 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సహా 15 మందిని అరెస్ట్ చేసింది. ఆరు ఛార్జ్సీట్లను కూడా నమోదు చేసింది. రూ.128 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.