Leading News Portal in Telugu

Mumbai: అటల్ సేతు పైనుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్య



Mumbai

ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి 43 ఏళ్ల వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాసింది. దీంతో అతడు ముంబైలోని భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాం కోసం గాలిస్తున్నారు. ఇంట్లో వదిలి వెళ్లిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అటల్ సేతు బిడ్జిని ముంబైలో కొత్తగా నిర్మించారు. ఇటీవలే ప్రధాని మోడీ ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఒక వైద్యురాలు ఇక్కడ నుంచి ప్రాణాలు తీసుకుంది. సముద్ర వంతెనపై నుంచి మహిళ దూకినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆమె మృతదేహం కోసం గజ ఈతగాళ్ల చేత గాలిస్తున్నారు.

కింజల్ కాంతిలాల్ షా అనే మహిళ వృత్తిరీత్యా వైద్యురాలు అని పోలీసులు తెలిపారు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి భరించలేకనే ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముంబైలోని పరేల్ ప్రాంతంలోని దాదాసాహెబ్ ఫాల్కే రోడ్డులోని నవీన్ ఆశా భవనంలో ఆమె తన తండ్రితో కలిసి ఉంటుందని పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచి ట్యాక్సీ తీసుకుని అటల్ సేతు దగ్గర తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరిందని పోలీసులు వెల్లడించారు.

సముద్ర వంతెనపై కొంత దూరం వెళ్లాక మహిళ టాక్సీని ఆపమని డ్రైవర్‌ను కోరింది. కానీ అతడు ఆపేందుకు ఇష్టపడలేదు. కానీ ఆమె పట్టుబట్టడంతో డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. ఆమె కారులో నుంచి దిగిన వెంటనే వంతెనపై నుంచి దూకేసిందని సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కోటే చెప్పారు. అనంతరం డ్రైవర్ నవీ ముంబై పోలీసులకు సమాచారం అందించాడు, వారు కోస్టల్ పోలీసులు, స్థానిక గ్రామస్తుల సహాయంతో ఆమె జాడ కోసం ఆపరేషన్ ప్రారంభించారు.

సోమవారం ఏదో పని నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు తండ్రికి ఆమె ఫోన్ చేసి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ఇంట్లో ఉన్న సూసైడ్ నోట్‌ను చూశారని.. తన జీవితాన్ని ముగించుకోవడానికి అటల్ సేతుకు వెళుతున్నట్లు ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు అధికారి తెలిపారు. దీంతో ఆమె తండ్రి ముంబైలోని భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. CCTV ఫుటేజీని పరిశీలించగా ఆమె సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వంతెనపై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఎనిమిదేళ్లుగా తీవ్రమైన డిప్రెషన్‌ కారణంగానే అటల్‌ సేతుపై నుంచి దూకి తన జీవితాన్ని ముగించుకోవాలని ఆ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

దేశంలోనే ఇది అతి పొడవైన సముద్ర వంతెన ఇది. జనవరిలో ప్రధాని మోడీ ప్రారంభించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సేవి-నవ శేవ అటల్ సేతు అని పేరు పెట్టారు. ఈ సముద్ర వంతెన దక్షిణ ముంబైని-నవీ ముంబైని కలుపుతుంది.