Leading News Portal in Telugu

Heavy Rain Alert: ఒడిశాకు భారీ వర్ష సూచన



Rain

గత వారం నుంచి దేశ వ్యాప్తంతా ఆయా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల గాలివానతో పాటు వడగండ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఆస్తి, ప్రాణనష్టాలు కూడా జరిగాయి. అయితే తాజాగా కేంద్ర వాతావరణ శాఖ.. మరిన్ని రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఇక ఒడిశా రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మార్చి 20 బుధవారం ఉదయం నుంచి 24 గంటల పాటు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం మార్చి 21, 22 తేదీల్లో కూడా ఖుర్దా, పూరీ, జగత్‌సింగ్‌పూర్, కటక్, నయాగఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ 5 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో పిడుగులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, కటక్, గజపతి, గంజాం, ఖోర్ధా, నయాగర్ మరియు పూరీ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

దీంతో పాటు ఒడిశాలోని కోరాపుట్, మల్కన్‌గిరి, రాయగడ, కంధమాల్, దెంకనల్, కియోంజర్, మయూర్‌భంజ్ జిల్లాల్లో తుపాను, పిడుగులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ వారం మొత్తం భువనేశ్వర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అలాగే పట్టణాల్లో ట్రాఫిక్ సూచనలు పాటించాలని తెలిపింది. రైతులు కూడా తమ పంట పొలాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.