
Annamalai: బీజేపీ దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్ చేసింది. ముఖ్యంగా తమిళనాడులో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి కారణం మాజీ ఐపీఎస్ అధికారి, తమిళ సింగంగా పేరు తెచ్చుకున్న కె. అన్నామలై. 37 ఏళ్ల ఈ యంగ్ పొలిటిషియన్‌ని బీజేపీ తమ భవిష్యత్తుగా భావిస్తోంది. అందుకనే అతి తక్కువ వయసులో తమిళనాడు వంటి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ పార్టీ అన్నామలైని చాలా స్పెషల్‌గా భావిస్తోంది. తమిళనాడు ద్రవిడ రాజకీయాలను, జాతీయవాద రాజకీయాలుగా మార్చే విధంగా అన్నామలై ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన ‘ఎన్ మన్, ఎన్ మక్కల్’(నా నేల, నా ప్రజలు) పాదయాత్రకు తమిళ యూత్, ప్రజల్లో విపరీత స్పందన వచ్చింది.
బీజేపీ అసలు తమిళనాడులో లేదనుకున్న స్థితి నుంచి అధికార పార్టీ డీఎంకే సహా ఇతర పార్టీలన్నీ కూడా అన్నామలైని టార్గెట్ చేస్తున్నాయంటే ఆయన ఎంత కీలకంగా మారారో తెలుస్తోంది. సీఎం స్టాలిన్ మొదలు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల కాలంలో అన్నామలైని టార్గెట్ చేస్తూ విమర్శించారు, అంతే ధీటుగా అన్నామలై వారికి సమాధానం ఇస్తున్నారు. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ సత్తా చాటాలని అనుకుంటోంది. ఒపీనియన్ పోల్ ప్రకారం.. ఈ సారి తమిళనాడులో 3-5 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీ క్యాష్ చేసుకోవాలని అనుకుంటోంది. ఏఐడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలిత మరణించిన తర్వాత డీఎంకేకి ప్రధాన పోటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలని అనుకుంటోంది. రాష్ట్రంలో 40 శాతం ఓట్లు ఇటు డీఎంకే అటు అన్నాడీఎంకేలకు పడటం లేదు. ఈ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. భవిష్యత్తులో తమిళ రాజకీయాలు అన్నామలై, తలపతి విజయ్, ఉదయనిధి స్టాలిన్ కేంద్రంగా నడుస్తాయనే చర్చ జరుగుతోంది.
Read Also: Love Affair: 20 సెకన్ల వ్యవధిలో 10 సార్లు ప్రియురాలి గొంతు కోసి కిరాతకంగా హత్య..
కోయంబత్తూర్ నుంచి అన్నామలై పోటీ:
తమిళనాడులో కోయంబత్తూర్ ప్రాంతంతో బీజేపీకి ప్రత్యేక సంబంధం ఉంది. ఈ స్థానంలో చివరిసారిగా 1996లో డీఎంకే గెలిచింది. ఏఐడీఎంకే మాజీ నాయకుడు, కోయంబత్తూర్ మేయర్ గణపతి రాజ్‌కుమార్‌ని ఈ స్థానానికి అభ్యర్తిగా ప్రకటించింది. తమిళ అసెంబ్లీకి ఈ స్థానం నుంచే తొలిసారిగా ఎమ్మెల్యే గెలుపొందారు.
1998లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ టార్గెట్‌గా కోయంబత్తూర్ బాంబు పేలుళ్లు జరిగాయి. దీని తర్వాత మతపరంగా ఇక్కడ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయి. 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ విజయం సాధించింది. మరోవైపు ఇక్కడి వస్త్ర పరిశ్రమలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి పనులు చేసేవారు ఉండటం, ఈ ప్రాంతాల్లోనే సెటిల్ కావడం బీజేపీకి కలిసొచ్చే అంశం.
అన్నామలై కోయంబత్తూర్ నుంచి ఖచ్చితంగా విజయం సాధిస్తారని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ టార్గెట్ కూడా అన్నామలైని పార్లమెంట్‌లోకి తీసుకురావడమే. మరోవైపు బీజేపీ పొత్తులు దాదాపుగా తేలాయి. ఇక ప్రతిపక్షాలు బీజేపీ టార్గెట్‌గా విమర్శలు చేయడం కూడా పరోక్షంగా కమలానికి క్రేజ్ తెస్తోంది. డీఎంకేలో సీఎం మొదలు అందరు మంత్రులు, ఇండియా కూటమి నేతలు బీజేపీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం కూడా ఓ రకంగా మంచిదే అని కమలం నేతలు భావిస్తున్నారు.