Leading News Portal in Telugu

Delhi liquor policy scam: మద్యం పాలసీలో ‘‘కింగ్‌పిన్’’ కేజ్రీవాల్.. కోర్టుకు తెలిపిన ఈడీ..



Arvind Kejriwal

Delhi liquor policy scam: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోరుతూ ఈ రోజు రోస్ ఎవెన్యూ కోర్టులో వాడీవేడి వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ కేజ్రీవాల్‌ని కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరుతోంది. ఈడీ తరుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కేజ్రీవాల్‌కి 10 కస్టడీని కోరారు. ఈడీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో మొత్తం ఢిల్లీ మద్యం కుంభకోణంలో ‘‘కింగ్‌పిన్’’ అరవింద్ కేజ్రీవాల్ అని తెలిపింది. ఇతను ‘‘సౌత్ లాబీ’’కి అనుకూలంగా వ్యవహరించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Read Also: Arvind Kejriwal: ఈడీ అధికారులపై కేజ్రీవాల్ నిఘా..?

మద్యం పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాలుపంచుకున్నట్లు ఈడీ కోర్టు తెలిపింది. లంచాలు తీసుకునే విధంగా పాలసీని రూపొందించినట్లు ఈడీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అంటూ ఈడీ తన వాదనల్ని కోర్టు ముందుంచింది. కేజ్రీవాల్ అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఈ కుంభకోణంలో వచ్చిన ఆదాయాన్ని గోవా ఎన్నికల ప్రచారంలో ఆప్ వినియోగించినట్లు ఈడీ ఆరోపించింది.

ప్రస్తుతం ఈ కేసులో ఆప్ నుంచి అరెస్టైన నాలుగో నేత కేజ్రీవాల్. అంతకుముందు ఈ కేసులో ఆప్ నేతలు సత్యేందర్ జైన్, మనీస్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ నేత కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇది బీజేపీ పన్నాగమని, లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి నేతల్ని భయపెట్టేందుకు కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీలను వాడుకుంటోందని ఆరోపించారు.